-->

మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ బృందం

 

మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ బృందం

మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ బృందం

కాంగ్రెస్ పాలనలో మళ్లీ విద్యుత్ కష్టాలు.. రైతులకు తీవ్ర అన్యాయం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ బృందం సందర్శించింది. విద్యుత్ ప్లాంట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను అధికారులు ప్లాంట్‌లోకి అనుమతించకపోవడంతో వారు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతులు, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ విద్యుత్ కోతలు, విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయని ఆయన విమర్శించారు.

రైతులకు కేవలం ఎనిమిది గంటల విద్యుత్‌ను కూడా విడతల వారీగా అందిస్తున్నారని ఆరోపించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతులు మోటార్లు ఆన్ చేయడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లో-వోల్టేజీ కారణంగా మోటార్లు దెబ్బతినడం జరుగుతోందన్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చుకునేందుకు రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

తెలంగాణలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలంటే సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులు, నిర్వహణలో లోపాల కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని 19 వేల మెగావాట్లకు పెంచామని, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలోనే విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసిందని విమర్శించారు. హైడల్ పవర్ ప్లాంట్లలో నీటి కొరత, థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో సమస్యల కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల పరిస్థితిని తెలుసుకునేందుకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు వచ్చామని తెలిపారు. అయితే ప్లాంట్‌లోకి తమను అధికారులు అనుమతించకపోవడం శోచనీయమన్నారు. నాలుగు యూనిట్లలో రెండు యూనిట్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారని, ఈ పరిస్థితిపై నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

రైతులు, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు తక్షణమే నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్ బృందం డిమాండ్ చేసింది. సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేసి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

అలాగే కాలిపోయిన రైతుల ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లను ఉచితంగా మరమ్మతులు చేయడం లేదా మార్చడం ద్వారా రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.