సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల సమావేశం
సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల సమావేశం
ప్యాకేజీలు–9, 10 పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసి నీళ్లు విడుదల చేయాలి
ప్యాకేజీలు–11, 12 పనులు మే 2027 నాటికి పూర్తి చేయాలి
జూలూరుపాడు టన్నెల్ పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి
ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చేపట్టిన ట్రంక్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు.
సమావేశంలో సత్తుపల్లి ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా బేతుపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలను అందించి, స్థానిక రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని మంత్రి తుమ్మల వివరించారు.
అక్టోబర్ నాటికి ప్యాకేజీలు–9, 10 పూర్తి
సత్తుపల్లి ట్రంక్ కెనాల్‌కు సంబంధించిన ప్యాకేజీలు–9, 10లో మిగిలిన పనులను అక్టోబర్ 2026 చివరి నాటికి పూర్తి చేసి బేతుపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్యాకేజీలు–11, 12 పనులను మే 2027 నాటికి పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, పనులకు అవసరమైన భూమిని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
పైప్‌లైన్ ఇరిగేషన్ నెట్‌వర్క్‌పై పరిశీలన
అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు–7, 8ను సంప్రదాయ ఓపెన్ కెనాల్ విధానంలో చేపడితే పెద్దఎత్తున భూసేకరణ చేయాల్సి వస్తుందని మంత్రి తుమ్మల వివరించారు. సుమారు 2,500 ఎకరాల మేర భూమి అవసరమయ్యే అవకాశం ఉందన్నారు.
నియోజకవర్గంలో ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర వాణిజ్య పంటల సాగు విస్తృతంగా జరుగుతున్నందున రైతుల భూములను సాధ్యమైనంత వరకు కాపాడుతూ, భూసేకరణ భారాన్ని తగ్గించేందుకు ప్యాకేజీలు–7, 8ను పైప్‌లైన్ ఇరిగేషన్ నెట్‌వర్క్ విధానంలో చేపట్టే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల కోరారు.
దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, పైప్‌లైన్ ఇరిగేషన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జూలూరుపాడు టన్నెల్ పనులు వెంటనే ప్రారంభించాలి
సీతారామ ఎత్తిపోతల పథకంలోని జూలూరుపాడు టన్నెల్ పనులపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా దృష్టి సారించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పరిధిలో సుమారు 155 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు.
పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ ప్రతినిధులు అవసరమైన యంత్రాలు, సిబ్బంది, ఇతర వనరులను తక్షణమే సమీకరించి పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు త్వరలో జూలూరుపాడు ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు.
కాలువల పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగంపై పరిశీలన
SRLIP కాలువల పరిధిలో అందుబాటులో ఉన్న భూమిని వినియోగించుకుని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రాజెక్టు పంప్‌హౌస్‌లకు వినియోగించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
పంప్‌హౌస్‌ల విద్యుత్ అవసరాలను కొంత మేర సౌర విద్యుత్ ద్వారా తీర్చడంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల సూచించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించి, కన్సల్టెంట్‌ను నియమించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం రైతులకు సాగునీటి విస్తరణే లక్ష్యం
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం ప్రాంతంలోని రైతులకు సాగునీటి సౌకర్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇటీవల సీతారామ ప్రాజెక్టులోని మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తుమ్మలచెరువుకు విడుదల చేయడం ఈ దిశగా మరో కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో కొత్తగూడెం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా చైర్మన్ కేశవరాజు, ప్రసాద్ అండ్ కంపెనీ చైర్మన్ సాయిబాబురాజు, కావేరి కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ రావు, ఎస్‌కేఆర్ కంపెనీకి చెందిన సంకినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment