కనులపండువగా ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం.. గంగమ్మ ఒడికి మహాగణపతి!
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా, ప్రశాంతంగా ముగిసింది. 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణేశుడు శుక్రవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఖైరతాబాద్ నుంచి మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. మార్గమధ్యంలో వేలాది మంది భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.
ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ల సహాయంతో మధ్యాహ్నం 2.15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగిన మహాగణపతి శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రారంభ సమయంలో ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం చేస్తూ సందడి చేశారు.
దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా ముగిసింది.

Post a Comment