-->

ఖమ్మంలో ఆహార భద్రత అధికారుల కొరడా.. 11 కేసులు నమోదు

 

ఖమ్మంలో ఆహార భద్రత అధికారుల కొరడా.. 11 కేసులు నమోదు

ఖమ్మంలో ఆహార భద్రత అధికారుల కొరడా.. 11 కేసులు నమోదు

ఖమ్మం రూరల్: ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న ఆహార వ్యాపార సంస్థలపై ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, ధాబాలు, రిటైల్ సంస్థలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని సంస్థలపై మొత్తం 11 కేసులు నమోదు చేసి రూ.2.90 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

పలు సంస్థలపై జరిమానాలు

తనిఖీల్లో భాగంగా పలు సంస్థలపై కోర్టు ద్వారా జరిమానాలు విధించారు. వాటిలో..

  • రమేష్ ధాబా – రూ.1,00,000
  • హావెలీ – రూ.75,000
  • రిలయన్స్ రిటైల్ – రూ.50,000
  • డిలైట్ మండీ – రూ.20,000
  • జాజు (Zazu) – రూ.20,000

ఇతర కేసుల్లోనూ జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.

చికెన్‌లో బల్లి ఘటన.. రమేష్ ధాబాపై రూ.లక్ష జరిమానా

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్‌రోడ్‌లో ఉన్న రమేష్ ధాబాలో చికెన్ వంటకంలో బల్లి కనిపించిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై 'దిశ' దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ధాబాల్లో ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలపై చర్యలు తీసుకోవాలని కథనాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రమేష్ ధాబాను తనిఖీ చేసి, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో కోర్టు రూ.1 లక్ష జరిమానా విధించింది.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల సమయంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర ఆహార సంస్థల్లో పరిశుభ్రమైన వంటగదులు, సురక్షితమైన ముడి పదార్థాల వినియోగం, సరైన నిల్వ విధానాలను పాటించాలని స్పష్టం చేశారు.

ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలు, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

ధాబాను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్

రమేష్ ధాబాపై కోర్టు రూ.లక్ష జరిమానా విధించడాన్ని పలువురు వినియోగదారులు స్వాగతిస్తున్నారు. ఆహారంలో బల్లి వంటి ఘటనలు చోటుచేసుకునే స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే ధాబాలు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే శాశ్వతంగా మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రమేష్ ధాబా ఘటనపై ప్రచురితమైన కథనాల అనంతరం అధికారులు స్పందించి కేసు నమోదు చేయడం, చివరకు రూ.లక్ష జరిమానా విధించడంతో ఆహార భద్రతా నిబంధనల అమలుపై జిల్లాలో చర్చ జరుగుతోంది.

Blogger ఆధారితం.