-->

శబరిమలలో బంగారు కిరీటం మాయం!

 

స్ట్రాంగ్‌రూమ్‌లో 445.78 గ్రాముల కిరీటానికి బదులు 240 గ్రాముల నకిలీ కిరీటం

శబరిమలలో బంగారు కిరీటం మాయం!

స్ట్రాంగ్‌రూమ్‌లో 445.78 గ్రాముల కిరీటానికి బదులు 240 గ్రాముల నకిలీ కిరీటం

శబరిమల: ప్రముఖ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భద్రపరిచిన బంగారు కిరీటం మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో నిర్వహించిన తనిఖీల్లో అసలు కిరీటం స్థానంలో నకిలీ కిరీటం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆలయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన భక్తులు సమర్పించిన కిరీటం ఆలయ రికార్డుల్లో 445.78 గ్రాముల బరువుతో నమోదైంది. ఇది సుమారు 55.72 సవర్ల బంగారంతో తయారైనదిగా రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఇటీవల స్ట్రాంగ్‌రూమ్‌లో గుర్తించిన కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది.

నిబంధనలపై ప్రశ్నలు

ఆలయ నిబంధనల ప్రకారం స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి అక్కడ భద్రపరిచిన విలువైన వస్తువులను పరిశీలించే అధికారం కార్యనిర్వాహక అధికారికి (ఈఓ) మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కిరీటం ఎప్పుడు మాయమైంది? దాని స్థానంలో నకిలీ కిరీటం ఎప్పుడు ఉంచారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కిరీటం మాయమైన ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ, రికార్డులు, భద్రతా చర్యలు, గతంలో నిర్వహించిన తనిఖీల వివరాలను పరిశీలించే అవకాశం ఉంది.

అయితే కిరీటం మాయమైన కాలం, ఘటనకు బాధ్యులెవరు, నకిలీ కిరీటం ఎప్పుడు అక్కడికి చేరింది వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.