రాజమల్లు సేవలు అభినందనీయం - ఎస్.జె.కె. అహ్మద్
సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు సేవలు అభినందనీయమని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో న్యాయవాది, టిఎస్ఆర్టిసి మాజీ లీగల్ అడ్వైజర్ మెండు రాజమల్లు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ ఆధ్వర్యంలో రాజమల్లును ఘనంగా సన్మానించారు. ఆపై కేక్ కటింగ్ చేసి ఆయన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ, 1998వ సంవత్సరంలో కొత్తగూడెం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన మెండు రాజమల్లు నేటికీ తన ప్రత్యేక శైలిలో కేసులను వాదిస్తూ న్యాయ రంగంలోనే కాకుండా సామాజిక సేవలలోనూ విశేష ప్రాశంసలు పొందారని తెలిపారు.
న్యాయవాదిగా మాత్రమే కాకుండా, పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు లీగల్ అడ్వైజర్‌గా సేవలందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నారని ఆయన అభినందించారు. రాబోయే కాలంలో రాజమల్లు తన సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజల సంక్షేమానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సాలి భాస్కర్, నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, ఏవి రాఘవ, జిల్లేపల్లి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment