ACP కార్యాలయం పైకప్పు కూలి ఎస్ఐ మృతి
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున అంకుర్ విహార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లోని ACP కార్యాలయం పైకప్పు కూలిపోవడంతో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతిచెందారు. మృతుడిని 58 ఏళ్ల వీరేంద్ర మిశ్రా గా గుర్తించారు. ఆయన ఇటీవలే ACPకి వ్యక్తిగత సహాయకుడిగా (PA) విధుల్లో చేరారు.
వివరాల్లోకి వెళితే… రాత్రి విధుల్లో ఉన్న వీరేంద్ర మిశ్రా, కార్యాలయ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. కురిసిన భారీ వర్షాల ప్రభావంతో భవనం పైకప్పు కూలిపడింది. శబ్దం తెలుసుకున్న తోటి సిబ్బంది ఉదయం కార్యాలయానికి చేరుకోగా శిథిలాల కింద చిక్కుకున్న ఎస్ఐను గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఎటావా జిల్లా వాసిగా గుర్తించగా, ఆయన కుటుంబానికి సమాచారం అందించారు. ఒక పోలీసు అధికారుడు విధుల్లో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, భవనం స్థితిగతులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటివి జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment