ద్విచక్ర వాహన ప్రమాదంలో గర్భిణీ మృతి – భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా, బిచ్కుంద: ఏడాది క్రితం ఒక్కటైన ఓ నవదంపతుల జీవితంలో మృత్యువు ఊహించని విధంగా ప్రవేశించి ఇద్దరి ప్రాణాల్నే బలితీసుకుంది. గర్భవతిగా ఉన్న భార్య రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడగా, ఆమె మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బిచ్కుంద మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బిచ్కుందకు చెందిన మంగలి సునీల్ (30)కు మద్నూర్ మండలం పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతి (27)తో గత ఏడాది వివాహమైంది. ఇటీవలే ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం నిర్వహించారు. అనంతరం సునీల్, జ్యోతి పుట్టింటికి వదిలిపెట్టి బిచ్కుందకు వచ్చాడు. శుక్రవారం ఉదయం ఆమెను తిరిగి తీసుకురావడానికి వెళ్లాడు.
భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై బిచ్కుందకు వస్తుండగా, శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం వేగంగా ఉండటంతో జ్యోతి కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో సునీల్ ఆమెను వెంటనే బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లో బయల్దేరాడు. అయితే మార్గం మధ్యలోనే జ్యోతి మృతిచెందింది. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా ఆమె ఇంటివద్ద తండ్రి, తల్లి, బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి.
భార్యను విగతజీవిగా చూసిన సునీల్ తీవ్ర మనోవేదనకు లోనై బాత్‌రూంలోకి వెళ్లి యాసిడ్ తాగాడు. తీవ్ర అస్వస్థతతో బయటకు వచ్చి వాంతులు చేయడం చూసిన కుటుంబసభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతుండగానే రాత్రి అతడు కూడా మృతిచెందాడు.
ఒకే రోజు ఒకే కుటుంబంలో ఇద్దరి మరణాలు చోటుచేసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. పెళ్లి సంవత్సరం తీరకముందే జీవితమంతా కలలు కంటూ ముందుకెళ్తున్న దంపతుల మృతితో గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment