-->

యుద్ధ ఉద్రిక్తతలపై ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక ప్రకటన: ఉగ్రవాదానికి ఖండన, శాంతికి మద్దతు

 

యుద్ధ ఉద్రిక్తతలపై ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక ప్రకటన: ఉగ్రవాదానికి ఖండన, శాంతికి మద్దతు

హైదరాబాద్ – భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో, దేశంలోని ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన బోర్డు ఆఫీస్ బేరర్ల ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించబడింది.

బోర్డు తన ప్రకటనలో, దేశ భద్రత మరియు ప్రజల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం మరియు సాయుధ దళాలు సమైక్యంగా పని చేయాల్సిన అవసరాన్ని లా బోర్డు హైవ్లైట్ చేసింది.

ఇస్లాం శాంతి మతం – ఉగ్రవాదానికి మద్దతు లేదు

మతపరమైన స్పష్టతను ఇచ్చిన లా బోర్డు, ఉగ్రవాదానికి ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అమాయకుల హత్యను ఖండిస్తూ, మానవ విలువలకు విరుద్ధంగా ఉన్న అన్ని హింసాత్మక మార్గాలను తిరస్కరించింది. భారత్-పాక్ దేశాలు తమ మధ్య ఉన్న సమస్యలను శాంతియుత దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే, దాని ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

సేవ్ వక్ఫ్ ఉద్యమానికి తాత్కాలిక విరామం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బోర్డు 'సేవ్ వక్ఫ్' ఉద్యమంలో భాగంగా జరుగుతున్న బహిరంగ కార్యక్రమాలను మే 16 వరకూ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మసీదులలో ప్రసంగాలు, మతాంతర సంభాషణలు, జిల్లా అధికారులకు మెమోరాండమ్‌లు, మీడియా సమావేశాలు వంటి ఇండోర్ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

శాంతి పునరుద్ధరణపై ఆశాభావం

దేశ ముస్లింల తరఫున మాట్లాడుతున్న లా బోర్డు, సమాజం శాంతి పునరుద్ధరణపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రజలు మతపరంగా ఏవిధమైన విభేదాలకూ తావు ఇవ్వకుండా, సమైక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చింది. దేశ భద్రతకు మద్దతుగా నిలవడం ప్రతి పౌరుని బాధ్యతగా పేర్కొంది.

Blogger ఆధారితం.