గోదావరిలో పులస పండగ రేట్లు… కిలోకు రూ.20 వేల దాకా!
అంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గోదావరిలో పులసలు దొరకడం అరుదైపోవడంతో మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. తాజాగా యానాం తీరప్రాంతంలో ఒక మత్స్యకారుడి వలలో చిక్కిన 1.6 కిలోల పులస చేపను కాకినాడకు చెందిన ఓ వ్యక్తి రూ.28 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అదే రోజు మరో పులస చేప రూ.23 వేలకే అమ్ముడైంది. ప్రస్తుతం ఒక కిలో పులస చేప ధర రూ.20 వేల వరకు పలుకుతోంది.
పులసలు గోదావరిలో ఎదురీదుతూ సంతానోత్పత్తి కోసం వచ్చే విలస చేపలు. ఈ ప్రయాణంలో వచ్చే ప్రత్యేక రుచి కారణంగా మాంసాహారులు వీటికి భారీగా డిమాండ్ చూపిస్తున్నారు. అయితే కాలుష్యం, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల పులసల సంఖ్య క్రమంగా పడిపోతోందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే జాలర్లకు పులస సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
గతంలో గోదావరిలో పులసలు విస్తారంగా లభించేవి. కానీ గత సంవత్సరం నుండి పరిస్థితి మారిపోయింది. గోడితిప్ప, బోడసకుర్రు ప్రాంతాల జాలర్లు ప్రతిరోజూ వేటకు వెళ్లినా, చాలాసార్లు చేపలు దొరకక నిరాశతో తిరిగి వస్తున్నారు. అరుదైన లభ్యత కారణంగా కొందరు ముందుగానే జాలర్లకు డబ్బు ఇచ్చి పులసల కోసం బుకింగ్స్ చేస్తున్నారు.
ఇక గోదావరిలో పులసలు దొరకకపోయినా, యానాం మార్కెట్లో మాత్రం విలసలు లభిస్తున్నాయి. ఈ పరిస్థితిని కొంతమంది వ్యాపారులు లాభదాయకంగా మలుచుకుని, కోల్‌కతా, హౌరా ప్రాంతాల నుండి విలసలను తెప్పించి ‘పులస’ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం.

Post a Comment