-->

మేడ్చల్ అక్రమ సరోగసీ రాకెట్‌లో సంచలనాలు.. 6 ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులు!

మేడ్చల్ అక్రమ సరోగసీ రాకెట్‌లో సంచలనాలు.. 6 ఫెర్టిలిటీ సెంటర్లతో లింకులు!


సికింద్రాబాద్‌లోని యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కుంభకోణం మరవకముందే మేడ్చల్ జిల్లాలో మరో పెద్ద అక్రమ సరోగసీ రాకెట్ బయటపడింది.

శుక్రవారం (ఆగస్టు 15) పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏకంగా ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు కలిపి ఎనిమిది మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ వ్యవహారంలో పట్టుబడ్డారు.

పేద యువతులను మోసగించి.. లావాదేవీలు బహిర్గతం

ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి (45), ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి (23) కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
లక్ష్మి సరోగెంట్ తల్లుల చేత ప్రామిసరి బాండ్లు రాయించుకుని, పిల్లలు కనిపించిన తర్వాత కేవలం నాలుగు నుంచి ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చేది.
అయితే అసలు సరోగసీ తల్లిదండ్రుల నుంచి మాత్రం 20–25 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

గతంలోనూ జైలుశిక్ష.. కానీ తీరు మార్చుకోలేదు

లక్ష్మి గతంలో ముంబైలో పిల్లల విక్రయాల కేసులో అరెస్టై జైలుకు వెళ్ళినా, తిరిగి హైదరాబాద్‌కు వచ్చి పాత పద్ధతిలోనే దందా కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆమె కుమారుడు, కూతురుతో కలిసి ఈ అక్రమ వ్యాపారాన్ని తిరిగి విస్తరించిందని పోలీసులు వెల్లడించారు.

ప్రమాణ పత్రాలు, మందులు, ఇంజక్షన్లు సీజ్

పోలీసుల దాడుల్లో లక్ష్మి ఇంట్లో భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భాదారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు స్వాధీనం అయ్యాయి.
అలాగే పలు ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్లిన దంపతుల వివరాలను ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్న ఆధారాలు కూడా లభించాయి.

ఆస్పత్రుల లింకులు బయటకు

ఈ రాకెట్‌కు నగరంలోని పలువురు ఐవీఎఫ్ హాస్పిటల్స్‌తో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా:

  • హెగ్డే హాస్పిటల్
  • అను టెస్ట్ ట్యూబ్ సెంటర్
  • ఈవీఎఫ్ ఐవీఎఫ్
  • ఫర్టి కేర్
  • శ్రీ ఫెర్టిలిటీ
  • అమూల్య ఫెర్టిలిటీ సెంటర్

ఈ కేంద్రాలతో లక్ష్మి సంబంధాలపై పోలీసులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు.

తదుపరి దర్యాప్తు

ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు, సరోగసీ మాఫియాతో లింకులు ఉన్న వైద్యులపై కూడా కన్నేశారు. అక్రమ గర్భధారణ వ్యాపారం వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం.

Blogger ఆధారితం.