వలపు వలలో 80 ఏళ్ల వృద్ధుడు – ₹8.7 కోట్లు లూటీ చేసిన సైబర్ గ్యాంగ్
ముంబై, సోషల్ మీడియాలో పెరిగిన పరిచయం చివరికి ఒక వృద్ధుడి జీవితాన్నే తలకిందులు చేసింది. ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మొత్తం ₹8.7 కోట్లు కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల ప్రకారం, 2023లో ఫేస్‌బుక్‌లో "షార్వీ" అనే పేరుతో ఓ మహిళ వృద్ధుడిని సంప్రదించింది. భర్త నుంచి విడిపోయి, పిల్లలతో ఒంటరిగా ఉంటున్నానంటూ భావోద్వేగంగా మాయమాటలు చెప్పింది. తర్వాత ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో సాన్నిహిత్యం పెంచుకొని ఆర్థిక సహాయం పేరుతో డబ్బులు తీసుకోవడం ప్రారంభించింది.
తరువాత "షార్వీ" మరణించిందని చెప్పి, ఆమె స్నేహితురాలు కవిత, సోదరి దినాజ్, స్నేహితురాలు జాస్మిన్ పేర్లతో కొత్త కొత్త కథలు చెప్పి వృద్ధుడి నుంచి మొత్తం 734 సార్లు డబ్బులు దోచుకున్నారు. డబ్బులు అయిపోయాక వృద్ధుడు అప్పు తీసుకొని కూడా పంపినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులు డబ్బుల లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు మోసం బహిర్గతమైంది. ఈ విషయం తెలిసి వృద్ధుడు షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment