స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ సందేశం
హైదరాబాద్: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయులకు నమస్కరిస్తూ, గాంధీజీ అహింసా స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. పండిట్ నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్య పునాది వేసుకున్నామని, తెలంగాణను ప్రపంచ అగ్రస్థానంలో నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
2023 డిసెంబర్ 7న బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని, రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు ₹20,616 కోట్ల రుణమాఫీ, ఎకరాకు ₹12,000 ‘ఇందిరమ్మ రైతు భరోసా’ సాయం అందించామని, 7,178 కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నాలకు క్వింటాల్‌కు ₹500 బోనస్‌తో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.
సన్న బియ్యం పథకం ద్వారా 3.10 కోట్ల మందికి లాభం చేకూర్చామని, 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం, ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించడం, ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచడం వంటి కీలక నిర్ణయాలు వివరించారు.
మహిళల కోసం మహాలక్ష్మీ ఉచిత బస్ ప్రయాణం ద్వారా ₹6,790 కోట్లు ఆదా జరిగిందని, యువతను డ్రగ్ మాఫియాల నుండి రక్షించేందుకు ‘ఈగిల్’ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, తెలంగాణను సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకతలో దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Post a Comment