మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త – సోలార్ పవర్ ప్లాంట్లకు భూమి కేటాయింపు
హైదరాబాద్: రాఖి పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు గిఫ్ట్ ప్యాక్ అందించినట్టే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని నేరుగా వారి పేరుమీద కేటాయించనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రభుత్వ ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయో అధికారులు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నిర్ణయం మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన దిశగా మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సంఘాలు ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్మడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయం లభించనుంది. తొలి దశలో నాలుగు ఎకరాల భూమి లీజుకు ఇవ్వాలని భావించిన ప్రభుత్వం, తాజాగా ఆ భూమినే యాజమాన్యంగా బదిలీ చేసేలా మార్పులు చేసింది.
ఈ పథకం కింద మొత్తం 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు ఖర్చు రూ.3 కోట్లు అవుతుందని అంచనా. ఇందులో 90% మొత్తాన్ని బ్యాంకుల రుణాల రూపంలో సమకూర్చి, మిగిలిన 10% మహిళా సంఘాలే భరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టులు పూర్తయితే, మహిళా సంఘాలకు సంవత్సరాల తరబడి స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు రాష్ట్రంలో పునర్వినియోగ శక్తి రంగం మరింత వేగం అందుకోనుంది.

Post a Comment