భారీ వరద ఉద్ధృతి.. బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
మహబూబ్‌నగర్: జిల్లాలో వరద ఉద్ధృతి మళ్లీ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో భూత్పూర్ మండల పరిధిలోని చెరువులు పొంగిపొర్లాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారులను దాటేస్తున్నాయి. ముఖ్యంగా అంబటిపల్లి వాగులో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో దివిటిపల్లి ఐటీ కారిడార్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఒకచోట పూర్తిగా తెగిపోయింది.
ఈ క్రమంలో, ఐటీ కారిడార్ సిబ్బందిని తరలించే ప్రైవేట్ బస్సు ఆ రహదారి దాటే సమయంలో అకస్మాత్తుగా కాలువ వైపు వంగి జారిపడే పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి, చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఘటన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురై ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న వారందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రహదారి పై ట్రాఫిక్ నిలిపివేయగా, వర్షం తగ్గే వరకు ఆ మార్గంలో ప్రయాణించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం వాగు నీటి ప్రవాహం తగ్గకపోవడంతో రహదారి మరమ్మతు పనులు చేపట్టే అవకాశం లేకపోగా, అధికారులు పక్క మార్గాల ద్వారా ప్రయాణించాల్సిందిగా సూచిస్తున్నారు.

Post a Comment