అబార్షన్ వికటించి మహిళ మృతి – ఆర్ఎంపీ డాక్టర్ పరార్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో శనివారం సాయంత్రం ఘోర సంఘటన చోటుచేసుకుంది. కడుపు నొప్పితో ఆసుపత్రికి చేరిన మహిళను ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందింది.
గోరంట్ల గ్రామానికి చెందిన బయగల శ్రీను భార్య విజేత (26) కడుపు నొప్పితో బాధపడుతుండగా ఈ నెల 15న తుంగతుర్తి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ గర్భంలో పిండం అడ్డంగా తిరిగిందని చెప్పి, ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులను ఒప్పించి రూ.25 వేల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం చేసిన శస్త్రచికిత్స విఫలమై విజేతకు తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఆసుపత్రి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగానే విజేత మృతి చెందిందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైద్యుడు శ్రీనివాస్ ఆసుపత్రికి తాళం వేసి పరారైనట్టు సమాచారం.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తుంగతుర్తి పోలీసులు ఆసుపత్రి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్ ఆందోళనకారులను నచ్చచెప్పి, సదరు ఆర్ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.
శవాన్ని పోస్టుమార్టం కోసం తొలుత తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినా, నిబంధనల కారణంగా తర్వాత సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్సై క్రాంతి కుమార్ వెల్లడించారు.
Post a Comment