-->

గంజాయి అక్రమ రవాణా కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా

గంజాయి అక్రమ రవాణా కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా


కొత్తగూడెం లీగల్: గంజాయి అక్రమ రవాణా కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (NDPS స్పెషల్ జడ్జి) ఎస్. సరిత గురువారం తీర్పు వెలువరించారు. నిందితుడికి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20,000 జరిమానా విధించారు.

కేసు వివరాలు:
2023 మార్చి 5న పాల్వంచ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం స్క్వాడ్ అధికారి ముబిషార్ అహ్మద్ తనిఖీలు నిర్వహిస్తుండగా, హనుమకొండకు చెందిన జన్ను మనోహర్ కుమార్ హోండా డియో స్కూటీపై 7.250 కిలోల గంజాయి ప్యాకెట్లు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని పాల్వంచ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్. గుర్నాథ్‌కు అప్పగించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో ముగ్గురు సాక్షులను పరీక్షించారు. వాదోపవాదాల అనంతరం, నిందితుడు దోషిగా తేలడంతో రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 20,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించగా, లైజాన్ ఆఫీసర్ మహమ్మద్ అబ్దుల్ ఘని మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పిసి రామకృష్ణ విచారణలో సహకరించారు.

Blogger ఆధారితం.