మహిళల రక్షణలో ముందంజలో షీ టీమ్స్ డీసీపీ భాస్కర్ సూచనలు
మంచిర్యాల : మహిళల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఐపీఎస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో షీ టీమ్స్ ఈ సంవత్సరం ఆగస్టు వరకు 81 మంది పోకిరీలను పట్టుకున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటివరకు షీ టీమ్స్‌కి మొత్తం 114 ఫిర్యాదులు అందగా, వాటిలో 18 క్రిమినల్ కేసులు, 7 పెట్టి కేసులు నమోదు చేసి, 89 మందికి కౌన్సిలింగ్, వార్నింగ్‌లు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం స్థానిక డీసీపీ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
హాట్‌స్పాట్లపై కఠిన నిఘా
హాట్ స్పాట్స్ గా గుర్తించిన ప్రాంతాలను షీ టీమ్స్ ప్రతిరోజు సందర్శించాలని డీసీపీ సూచించారు. స్కూళ్లు, కళాశాలలు, జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
మహిళా హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు, మహిళా ఇన్‌చార్జి తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
భరోసా సెంటర్లలో పూర్తి సహాయం
బాధిత మహిళలు, బాలికలకు భరోసా సెంటర్లలో వైద్యం, కౌన్సిలింగ్, లీగల్ అడ్వైజర్, మెడికల్ సహాయం అందుబాటులో ఉండాలని డీసీపీ స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు మానసిక ధైర్యం కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలపై హెచ్చరిక
పిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోలు, అత్యాచారం, సామూహిక అత్యాచారం వీడియోలను అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ, పోక్సో యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం నేరం రుజువైతే జైలు శిక్ష లేదా జరిమానా తప్పదని తెలిపారు.
మహిళలకు సూచనలు
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలిసిన వారిచేనే ఎక్కువ వేధింపులు జరుగుతున్నాయని గుర్తించి భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.
📞 ఫిర్యాదు నంబర్లు :
- రామగుండం షీ టీం వాట్సాప్ : 6303923700
- మంచిర్యాల షీ టీం : 8712659385
- అత్యవసర నంబర్ : 100
ఈ సమీక్షా సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్‌కుమార్, మంచిర్యాల షీ టీం ఇన్‌చార్జి ఎస్సై ఉషారాణి, హైమ, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment