-->

వ్యక్తికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 10 వేలు జరిమానా

వ్యక్తికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 10 వేలు జరిమానా


కొత్తగూడెం లీగల్ :: కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. మాచర్ల ఏసుబాబు అనే వ్యక్తికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

కేసు వివరాలు:
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌కు చెందిన పిప్పళ్ళ సుమంత్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది. అతని అక్క రాజేశ్వరి సుమారు 20 సంవత్సరాల క్రితం డోర్నకల్ మండలం చిక్కుడు గ్రామానికి చెందిన కొలిపాక అశోక్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వారు పాల్వంచ మండలం మంచి కంటినగర్‌లో నివసిస్తూ ఉండేవారు.

గత కొద్దికాలంగా రాజేశ్వరి, ఎదురింటి వ్యక్తి మాచర్ల ఏసుబాబుతో తరచూ ఫోన్లో మాట్లాడుతోందని భర్త అశోక్ అనుమానం వ్యక్తం చేశాడు. పెద్దల సలహా మేరకు మధ్యవర్తిత్వం జరిగినా, సంబంధం నిలవలేదు. అశోక్‌కు అనుమానం మరింత బలపడటంతో, 2019 నవంబర్ 5న భార్యపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అశోక్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేశ్వరి రక్తపు మడుగులో పడిఉండగా, కుటుంబసభ్యులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పిప్పళ్ళ సుమంత్ ఫిర్యాదు మేరకు పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తు:
అప్పటి ఎస్సై జె. ప్రవీణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎం. అబ్బయ్య మరియు పి. నవీన్‌లు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 16 మంది సాక్షులను విచారించిన తర్వాత, కోర్టు మాచర్ల ఏసుబాబు నేరం చేసినట్టు నిర్ధారించింది.

తీర్పు వివరాలు:
కోర్టు తీర్పు ప్రకారం, ఏసుబాబు రూ.9,000ను అశోక్ కుమారుడు కొలిపాక భీమ్ ప్రకాష్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్‌గా వేయాలని, మిగిలిన రూ.1,000ను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించింది.

ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై జి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ జరుపుల రవి సహకరించారు.



Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793