ప్రియురాలి ఆత్మహత్యను తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
రెండు రోజుల వ్యవధిలో ప్రేమజంట దుర్మరణం
రంగారెడ్డి జిల్లా : అక్టోబర్ 30: రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో విషాదం నెలకొంది. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న యువజంట ఆత్మహత్యలకు పాల్పడడంతో గ్రామం అంతా మౌనంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే — ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని (18), అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజు (25) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. అయితే కుటుంబ పెద్దలు “ఇంకా కొంత కాలం ఆగాలి, ఇంట్లో ముందు పెళ్లిళ్లు పూర్తయ్యాక చూద్దాం” అని సూచించారు.
ఈ సూచనతో మనస్తాపానికి గురైన నందిని, సోమవారం రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణానికి నాగరాజే కారణమని ఆరోపించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
ఈ విషయం తెలిసిన నాగరాజు తీవ్ర ఆవేదనకు గురై, బుధవారం రోజు తన ప్రియురాలి ఆత్మహత్యను తట్టుకోలేక తానే ప్రాణాలు తీసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు రెండు కేసులను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment