స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించిన డీఈవో ఆల్ర విజయం
మెదక్ జిల్లా, నవంబర్ 22: నూతనంగా మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా బాధ్యతలు స్వీకరించిన ఆల్ర విజయం శుక్రవారం తూప్రాన్‌లో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమైన ఆమె, ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy & Numeracy), ఎఫ్ఎల్ఎస్ (Foundational Learning Study) అంశాలపై విస్తృతంగా సూచనలు అందించారు.
ప్రతి విద్యార్థికి కనీస విద్యాసామర్థ్యాలపై అవగాహన కల్పించి, విద్యార్థుల చదువులో పురోగతి సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈవో విజయం సూచించారు. జనవరిలో జరగనున్న ఎఫ్ఎల్ఎస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాఠశాలలదేనని ఆమె పేర్కొన్నారు.
తూప్రాన్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను కూడా డీఈవో పరిశీలించారు. మార్చిలో జరుగనున్న వార్షిక పరిక్షలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరై, చదువుపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
నూతన డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఈవో విజయాన్ని ప్రిన్సిపాల్ పట్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ పార్వతి, సత్యనారాయణ, మండల ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ పట్లూరి లక్ష్మణ్, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment