2027లో గోదావరి పుష్కరాలు: జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 13: పురాణాల ప్రకారం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాలు 2027 సంవత్సరంలో ఘనంగా జరగనున్నాయి. బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేయడం, పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాలకు చేరుకొని పుణ్యస్నానాలు, దానధర్మాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
12 రోజుల పాటు పుష్కరాలు
2027లో గోదావరి పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
- పుష్కరాల ప్రారంభం: జూన్ 26, 2027
- పుష్కరాల ముగింపు: జులై 7, 2027మొదటి రోజును ‘ఆద్య పుష్కరం’గా పిలుస్తారు.
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తాలపై టిటిడి ఆస్థాన సిద్ధాంతి, ఆగమ వైదిక పండితులు వివరాలను ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించారు. తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకొని కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఏర్పాట్లపై దృష్టి
పుష్కరాల తేదీలపై స్పష్టత రావడంతో తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

Post a Comment