అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం
హైదరాబాద్, డిసెంబర్ 29: అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చదువు, భవిష్యత్ ఆశలతో విదేశాలకు వెళ్లిన యువతులు ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), కరీంనగర్ జిల్లా ముల్కనూరు ప్రాంతానికి చెందిన కడియాల భావన (24) గత మూడు సంవత్సరాల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన వారు ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి రెండు కార్లలో కాలిఫోర్నియాకు విహారయాత్రకు వెళ్లారు. టూర్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, మేఘనారాణి మరియు భావన ప్రయాణిస్తున్న కారు అలబామా హిల్స్ ప్రాంతంలోని ప్రమాదకరమైన మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా కలతకు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుమార్తెల మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధువులు కుటుంబాలను పరామర్శిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ ఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Post a Comment