ప్రాణాలూ పోతున్న రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత
హైదరాబాద్, జనవరి 09: హైదరాబాద్ నగరంలో చైనా మాంజా (Chinese Manja) వ్యాపారం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నప్పటికీ, కొందరు వ్యాపారులు లాభాల కోసం ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్బంధం లేకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీసులు చేపట్టిన విస్తృత దాడుల్లో రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన భారీ మొత్తంలో చైనా మాంజాను టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి సాధారణ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా చైనా మాంజా విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, గోదాములు, దుకాణాలు, నిల్వ కేంద్రాలపై వరుసగా సోదాలు నిర్వహించారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి ఆర్డర్ ఆధారంగా చైనా మాంజాను తెప్పించి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోనే అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్ట్ చేశారు. ఇక నగరవ్యాప్తంగా ఇప్పటివరకు చైనా మాంజా విక్రయాలపై మొత్తం 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంజా నిల్వలను పోలీసులు ధ్వంసం చేయనున్నట్లు తెలిపారు.
చైనా మాంజా వల్ల ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయినా కూడా కొందరు వ్యాపారులు హెచ్చరికలను పట్టించుకోకుండా అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. చైనా మాంజా విక్రయాలు, నిల్వలు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని, ఎవరైనా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment