-->

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు మేళా

వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాల ప్రారంభం


భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 09 : తెలంగాణ రాష్ట్రంలోని సన్న, చిన్న, కారు రైతులకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొత్త దిశ చూపుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం రైతు మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు రెండు కీలక వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తూ, 350 మంది రైతులకు రూ.1.07 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేశారు.

అలాగే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటలు, పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే మార్గాలపై రైతులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793