నాంపల్లి అగ్ని ప్రమాదలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం మరియు గోదాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని బేబీ (45), హబీబ్ (32), ఇంతియాజ్ (28), అఖిల్ (11), ప్రణీత్ (08)గా గుర్తించారు.
ప్రమాద సమయంలో మృతులంతా సెల్లార్‌లో చిక్కుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. తీవ్ర మంటల కారణంగా భవనం పూర్తిగా దెబ్బతింది. మృతదేహాలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా, ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భవనం భద్రతా పరిస్థితిని పరిశీలించేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. భవనం కూల్చివేతపై త్వరలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో దాదాపు ఒక రోజు పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ, ఐరన్ షట్టర్‌కు తాళం వేసి ఉండటంతో బాధితులు బయటకు రాలేకపోయారని తెలిపారు. అలాగే, భద్రతా నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.

Post a Comment