ఓపెన్ కాస్ట్ మైన్‌లో ప్రమాదం అప్రెంటీస్ ట్రైనీ కాలు ఫ్రాక్చర్
రామగుండం, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి సంస్థం రామగుండం రీజియన్–3 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ మైన్–1 బేస్ వర్క్ షాపులో శుక్రవారం ఉదయం షిఫ్ట్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అప్రెంటీస్ ట్రైనీగా పనిచేస్తున్న అభిలాష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో అతడి కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
డోజర్ సెక్షన్‌లో గ్రేడర్ కటింగ్ ఎడ్జ్‌ను మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కటింగ్ ఎడ్జ్ ట్రైనీ అభిలాష్‌పై పడటంతో ఈ సంఘటన జరిగింది. ఘటన వెంటనే గుర్తించిన అధికారులు అప్రమత్తమై గాయపడిన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఘటనను గోప్యంగా ఉంచే ప్రయత్నం?
ఈ ప్రమాదాన్ని బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై కార్మిక వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. సరైన అధికారుల పర్యవేక్షణ లేకుండా, అనుభవం లేని అప్రెంటీస్ ట్రైనీలకు ప్రమాదకర పనులు కేటాయించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాయపడిన ట్రైనీకి సంఘీభావం
గాయపడిన అప్రెంటీస్ అభిలాష్‌ను హెచ్.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, జాతీయ కార్యదర్శి ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్, RG-3 ఏరియా ఉపాధ్యక్షుడు శాంతి స్వరూప్ ఆర్జీ–3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొమ్ము మధునయ్యతో పాటు ఇతర నాయకులు పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న వారు, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. గాయపడిన కార్మికుడికి న్యాయం చేయాలని, పూర్తి బాధ్యత అధికారులే వహించాలని డిమాండ్ చేశారు.
అధికారుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణం
ఓసీపీ–1లో జరిగిన ఈ ప్రమాదం అధికారుల అత్యుత్సాహం, నిర్లక్ష్య ధోరణి వల్లే జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అనుభవజ్ఞులైన కేటగిరీ, డెసిగ్నేటెడ్ ఉద్యోగులతో చేయించాల్సిన పనిని అవగాహన లేని అప్రెంటీస్ ట్రైనీతో చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. అధికారుల ఓవర్ స్మార్ట్ నడవడిక కారణంగానే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం HMS డిమాండ్ చేశాయి.

Post a Comment