నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. భవనంలో ఇద్దరు చిన్నారులు ఉండటంతో కలకలం
హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో దహన పదార్థాలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భవనంలోని నాలుగు అంతస్తులకు విస్తరించాయి.
ఈ సమయంలో భవనంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి నాలుగు ఫైర్ ఇంజన్ వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసే ప్రయత్నాలతో పాటు భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ చర్యలు చేపట్టారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ లేదా ఫర్నీచర్‌లోని దహన పదార్థాల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Post a Comment