చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహం.. పూజల ఆనవాళ్లతో అనుమానాలు
నిర్మల్ జిల్లా బాసర పరిధిలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఓ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. మౌనీ అమావాస్య జరిగిన కొన్ని రోజుల అనంతరం చెట్టు కొమ్మకు ఏదో వేలాడుతున్నట్లు గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా అది మృతదేహమని గుర్తించి భయభ్రాంతులకు గురయ్యారు.
మృతదేహానికి సమీపంలో పూజలు చేసిన ఆనవాళ్లు, పసుపు–కుంకుమ, అలాగే పండర్పూర్ విఠలేశ్వరుడి విగ్రహం కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న బాసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన హత్యా, ఆత్మహత్యా, లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు మహారాష్ట్రకు చెందిన యువకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. పూజల ఆనవాళ్ల నేపథ్యంలో క్షుద్ర పూజల కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Post a Comment