కొత్త జిల్లాల ఏర్పాటు లేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందా? కొన్ని జిల్లాలను రద్దు చేస్తారా? అనే అంశంపై గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. రాజకీయ నాయకుల నుంచీ గ్రామాల్లోని రైతుల వరకూ ఇదే అంశంపై చర్చ జరుగుతుండటంతో ఊహాగానాలకు ఊతం లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
భట్టి విక్రమార్క ఏమన్నారు?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జిల్లాల్లో కొన్ని అశాస్త్రీయంగా ఉన్నాయన్నది నిజమేనని అంగీకరించారు. అయితే ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు గానీ, ఉన్న జిల్లాలను రద్దు చేయడం గానీ తమ ప్రభుత్వ ఆలోచనలో లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాల మార్పులపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాల వివాదం ఎలా మొదలైంది?
గత శీతాకాల శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 33 జిల్లాల ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, ఒకే నియోజకవర్గం రెండు లేదా మూడు జిల్లాల్లో విస్తరించి ఉండడం వల్ల పరిపాలనా సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ సైతం తమ జిల్లాను రద్దు చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిద్ధిపేట జిల్లాపై హరీశ్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొనగా, కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాల ఏర్పాటు వల్ల సమస్యలు ఉన్నాయా?
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల్లో పెద్ద సమస్యలేమీ లేవని కొందరు భావిస్తున్నప్పటికీ, ఒకే నియోజకవర్గం రెండు నుంచి మూడు జిల్లాల్లో ఉండటం మాత్రం ప్రధాన సమస్యగా మారిందని పరిపాలనా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రజలకు అధికారులతో పని చేయించుకోవడం కష్టంగా మారడంతో పాటు, ఎమ్మెల్యేలకు కూడా ఏ జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలన్న గందరగోళం ఏర్పడుతోంది. ఈ అంశమే జిల్లాలపై చర్చకు ప్రధాన కారణంగా మారింది.

Post a Comment