-->

భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్‌చల్.. వరంగల్ చౌరస్తాలో హైటెన్షన్

భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్‌చల్.. వరంగల్ చౌరస్తాలో హైటెన్షన్


వరంగల్, జనవరి 07: వరంగల్ నగర నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం ఓ మహిళ కత్తి పట్టుకుని చేసిన హంగామా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జువెలరీ షాప్ ముందు కత్తితో ధర్నాకు దిగుతూ భర్తను చంపేస్తానంటూ బెదిరించడంతో అక్కడ ఉన్న వ్యాపారులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ సిటీ కొత్తవాడకు చెందిన శ్రీకాంత్‌కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్నకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి వైష్ణవి (10) అనే కుమార్తె ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో విభేదాలు నెలకొనగా, భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది.

ఇక మరోవైపు, జ్యోత్స్న మానసిక పరిస్థితి సరిగా లేదని పేర్కొంటూ శ్రీకాంత్ కుమార్తె వైష్ణవికి దూరంగా ఉంటూ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం శ్రీకాంత్ వరంగల్ చౌరస్తాలోని ఓ జువెలరీ షాప్ ముందు ఉన్నాడని తెలుసుకున్న జ్యోత్స్న కత్తితో అక్కడికి చేరుకుని భర్తను వెంటాడింది. చంపేస్తానంటూ కేకలు వేస్తూ హంగామా చేయడంతో శ్రీకాంత్ భయంతో జువెలరీ షాప్‌లోకి దాక్కున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. జ్యోత్స్నతో పాటు ఆమె మామ లింగమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793