-->

సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ మెసేజులు… ఓపెన్ చేస్తే ఖేల్ ఖతం!

సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ మెసేజులు… ఓపెన్ చేస్తే ఖేల్ ఖతం!


అమరావతి: సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. ‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో జమ అవుతాయి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజులు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మొదట నమ్మలేదని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెప్పేలా ఈ మెసేజులు ఉండటంతో చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా లింకులు పూర్తిగా నకిలీవని పోలీసులు స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ ఆఫర్లు వచ్చాయని ఆసక్తితో లింక్‌ను ఓపెన్ చేస్తే మొబైల్‌లోకి మాల్వేర్ చొరబడుతుందని, ఫోన్‌లో ఉన్న ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

పండుగ వేళ ఎవరూ ఉచితంగా డబ్బులు పంచరని పోలీసులు ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు ఎప్పటికీ లింక్‌ల ద్వారా డబ్బులు ఆఫర్ చేయవని స్పష్టం చేశారు. అలాంటి సందేశాలు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.

సన్నిహితులు లేదా బంధువులు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అయినా సరే, అందులోని లింక్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయకుండా, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793