త్వరలో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం?
హైదరాబాద్ | జనవరి 18: తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ తరహా పథకాన్ని పురుషులకు కూడా విస్తరించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. అయితే ఇది అందరికీ కాకుండా, దివ్యాంగులైన పురుషులకు మాత్రమే వర్తించనుంది.
తెలంగాణలో ‘మహాలక్ష్మి’, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాల ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇదే తరహాలో ఇకపై దివ్యాంగులైన పురుషులకు కూడా 100 శాతం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలపై 50 శాతం రాయితీ మాత్రమే ఉంది. ఈ రాయితీని పూర్తిగా రద్దు చేసి, మహిళల మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిస్థాయిలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఖ్య, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలో పురుషులకు ‘ఫ్రీ’ బస్సు ప్రయాణం?
దివ్యాంగులైన పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులైన పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దివ్యాంగులైన పురుషులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.

Post a Comment