-->

మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు

గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన – కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క


News Desk | జనవరి 27: ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగకు చెందిన సంప్రదాయ నృత్యమైన “హాకా” నృత్యాన్ని వారు ఉత్సాహంగా ప్రదర్శించారు.

హాకా నృత్యం మావోరి తెగలో అత్యంత ప్రాచీనమైన సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి. యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా ఈ నృత్యాన్ని చేస్తారు. ముఖభావాలు, శరీర చలనాలతో కూడిన ఈ నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా, పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరకు హాజరయ్యారు. హాకా నృత్య ప్రదర్శన సమయంలో మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
“ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావు. ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయి” అని తెలిపారు.

అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. సమ్మక్క–సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793