అంతర్రాష్ట్ర బైకు దొంగల ముఠా అరెస్ట్ – 17 బైకులు స్వాధీనం
నిజామాబాద్ అర్బన్: వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిర్మల్ జిల్లా బాసర, ముథోల్, భైంసా, తానూర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా నవీపేట్, మాక్లూర్, రెంజల్, వర్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన బైక్ చోరీ కేసుల్లో 15 కేసులను పోలీసులు ఛేదించారు.
ఈ కేసుల్లో పాత నేరస్తులైన షేక్ అర్బాజ్, షేక్ ఇమ్రాన్, షేక్ సమీర్, షేక్ రెహమాన్ ప్రధాన పాత్రధారులుగా గుర్తించారు. వీరిపై గతంలోనే 10 కేసులు నమోదై ఉండగా, గత రెండు సంవత్సరాలుగా ముఠాగా ఏర్పడి ముఖ్యంగా పల్సర్ బైకులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ముఠా సభ్యులు మొత్తం 17 బైకులను దొంగిలించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్‌కు చెందిన షేక్ అర్బాజ్ రహమత్, సోమ్ కాంబ్లే, మనోజ్ షేర్, షాదుల్ షేక్ తక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి కూడా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 13న నవీపేట్‌లోని అయ్యప్ప ఆలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ముఠా సభ్యులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాశ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, ఎస్సై మహేశ్, నవీపేట ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment