కాజీపేటలో దారుణం: సుత్తెతో దాడి చేసి, డీజిల్ పోసి దహనం
హనుమకొండ జిల్లాలోని కాజీపేట అర్బన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిని ఇచ్చిన మామపై, కట్టుకున్న భార్యపై ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న బాషబోయిన రాజశేఖర్ (51) తన ముగ్గురు కుమార్తెలతో జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమార్తె రాజశ్రీను 2023లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన పొక్కుల ప్రవీణ్‌కు వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.3 లక్షల కట్నంతో పాటు ఇంటి సామగ్రిని ఇచ్చినప్పటికీ, అనంతరం ప్రవీణ్ తరచూ అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇటీవల రాజశ్రీకి కూతురు పుట్టడం, అలాగే ప్రమాదంలో ఆమె చేతికి గాయం కావడంతో పనులు చేయలేకపోతున్నదని ప్రవీణ్ తరచూ గొడవలకు దిగేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
నెలరోజుల క్రితం అన్నప్రాసన కోసం రాజశ్రీ తన తండ్రి ఇంటికి రాగా, వారం రోజుల క్రితం ప్రవీణ్ కూడా అక్కడికి వచ్చి ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ తన వెంట తెచ్చుకున్న సుత్తెతో మామ రాజశేఖర్, భార్య రాజశ్రీల తలపై దాడి చేశాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడిన అనంతరం ఇంకా ప్రాణాలతో ఉన్నారనే అనుమానంతో వారిపై డీజిల్ పోసి నిప్పంటించాడు.
తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా చూపించే ప్రయత్నంలో తన బంధువులకు ఫోన్ చేసి, వారు కాలిపోయి చనిపోయారని చెప్పినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరేసరికి ఇద్దరూ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
ఈ ఘటనపై తేజస్వి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, ఈ హత్యను ముందుగానే పథకం ప్రకారం అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గమనిక: కుటుంబ హింస, వరకట్న వేధింపులు సమాజానికి తీవ్రమైన ముప్పు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరం.

Post a Comment