ఘన్‌పూర్‌లో కోళ్ల ఫారంలో దొంగతనం – నిందితుడు అరెస్ట్
ఘన్‌పూర్: కోళ్ల ఫారంలో చోటుచేసుకున్న దొంగతనం కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేసి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజవోమంగి మండలం వంచంగి గ్రామానికి చెందిన మోడెం తలుపులయ్య అనే వ్యక్తి, స్టేషన్ ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన గడెం కొమురయ్యకు చెందిన కోళ్ల ఫారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న కోళ్ల ఫారం వద్ద ఉన్న నివాస గదిలో నుంచి రెండున్నర తులాల పుస్తెల తాడు, అర్థ తులం బంగారు ఉంగరాన్ని దొంగిలించి పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శివునిపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తలుపులయ్యను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ మనీషా మరియు పోలీసు సిబ్బంది విచారణ చేయగా సుమారు 15 రోజుల క్రితం దొంగతనం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment