-->

మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ముందస్తుగా రంజాన్, ఉగాది వేడుకలు

మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ముందస్తుగా రంజాన్, ఉగాది వేడుకలు


కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో ఉన్న మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో రంజాన్ మరియు ఉగాది పండుగలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

షడ్రుచుల జీవన పయనంలో కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరం “పరాభవ” నామ ఉగాది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ప్రేమ, కరుణ, శాంతి, సహనం, దాతృత్వం, క్రమశిక్షణ, సమానత్వం, సోదరభావం వంటి విలువలకు ప్రతిరూపమైన రంజాన్ పండుగను జరుపుకోబోతున్న వారికి ఈద్ ముభారక్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ, భిన్న కులాలు, విభిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనం భారతదేశమని, ఇక్కడ ప్రతి పండుగను పరస్పరం గౌరవించుకుంటూ కలిసి జరుపుకోవడం గొప్ప సంప్రదాయమని అన్నారు.

కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరూ కలిసి మానవతా విలువలను పెంపొందించుకోవాలని, పాఠశాలలు చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పరస్పర గౌరవ భావాన్ని పెంచే ఆలయాలుగా మారాలని సూచించారు. రాబోయే పరాభవ నామ ఉగాది సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు రంజాన్, ఉగాది పండుగల విశిష్టతను తెలియజేస్తూ నృత్యాలు, గానాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు శిరీషా, నుసరత్, లక్ష్మీ ప్రసన్న, విజయలక్ష్మీ, సల్మా, జేఫీషా, సరస్వతి, సల్మా జబీన్, నాజియా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793