-->

గర్భిణి భార్యను కత్తితో హత్య చేసిన భర్త

కోరుట్లలో దారుణం: గర్భిణి భార్యను కత్తితో హత్య చేసిన భర్త


జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19) ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వారు మాదాపూర్‌లోనే నివాసం ఉంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తుండగా, వైష్ణవి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది.

గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున సుమారు 4 గంటల సమయంలో హరిబాబు, వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793