-->

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. ఈ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. ఈ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు


ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తీవ్ర ఎండలు మండుతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వడగండ్ల వానలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంభవృష్టి కురవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం అసలైన ముప్పు మార్చి 18 నుంచి 20 తేదీల మధ్య ఉండనుంది. ఈ మూడు రోజులు వాతావరణం మరింత తీవ్రంగా మారి రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ స్తంభాలు నేలకూలడం, భారీ హోర్డింగ్‌లు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రత్యేకంగా వడగళ్ల వానల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని హెచ్చరించింది. పిడుగుల బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. రాబోయే 72 గంటలు అత్యంత కీలకంగా ఉండటంతో అధికార యంత్రాంగం హై అలర్ట్‌లో ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793