రంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమ మద్యం ధ్వంసం
రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను బుధవారం ధ్వంసం చేశారు. గత ఆరు నెలల కాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించిన మద్యం పై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో మొత్తం 103 కేసులు నమోదు చేసి 6,859 మద్యం బాటిళ్లు (సుమారు 3,077 లీటర్లు) మరియు 44 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసిన మద్యం నిల్వలను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

Post a Comment