లిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కలకలం.. రోగులను సురక్షితంగా తరలించిన అధికారులు
లిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కలకలం.. రోగులను సురక్షితంగా తరలించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని లిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి.
పొగలు ఆస్పత్రిలోని ఏసీ గదుల్లోకి చేరడంతో వైద్యులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని గదుల అద్దాలను పగులగొట్టి పొగ బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను దండుపల్లిలోని మరో ఆస్పత్రికి సురక్షితంగా తరలించారు.
ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ స్టేషన్లకు చెందిన ఫైర్ ఇంజిన్లతో వెంటనే ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే మంటలు అదుపులో ఉండటంతో పొగను పూర్తిగా బయటకు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చింది. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
ఘటన స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌కు గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment