తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల జోక్యాన్ని సహించబోము: ఎరవెల్లి జగన్
తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల జోక్యాన్ని సహించబోము: ఎరవెల్లి జగన్
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జేఎన్‌టీయూహెచ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జేఎన్‌టీయూహెచ్ ఐకాస రాష్ట్ర చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ఎరవెల్లి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వేలాది మంది అమరుల త్యాగాలు, లక్షలాది మంది ఉద్యమకారుల పోరాటం, కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటికీ ఆంధ్ర పాలక వర్గాలకు తెలంగాణ వనరులపై కన్ను ఉందని, రాష్ట్రంపై ఆధిపత్యం సాధించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ఆ సాకుతో తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆంధ్ర పాలక వర్గాలకు మద్దతుగా నిలుస్తూ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆంధ్ర పాలక వర్గాల సహకారంతో తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ నాయకులు తరచూ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని అన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణపై బీజేపీ మరియు ఆంధ్ర పాలక వర్గాలు చేస్తున్న కుట్రలను రాష్ట్ర సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల అనవసర జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు భరోసా కల్పించేలా అవకాశాలు కల్పించాలని, విద్యార్థి ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ ఆశయాల సాధన, సమగ్ర తెలంగాణ నిర్మాణం కోసం విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు రాహుల్ నాయక్, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సురేష్ నాయక్, ఓబీసీఎఫ్ అధ్యక్షుడు సందీప్, సాగర్ నాయక్, డీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు వివేక్ పటేల్, సాయి రాజ్, సుజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment