ఆగస్టు 10 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఆగస్టు 10 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 7: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక ప్రక్రియలు, ఇతర మిగిలిన పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఆగస్టు 10 నాటికి ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న ఆయన, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అదేవిధంగా పనుల నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే మిగిలిన అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కోలేటి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment