సిద్దిపేట మల్టీ పర్పస్ హైస్కూల్‌లో నిర్లక్ష్యం.. ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
సిద్దిపేట మల్టీ పర్పస్ హైస్కూల్‌లో నిర్లక్ష్యం.. ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
సిద్దిపేట, ఆగస్టు 5: సిద్దిపేట పట్టణంలోని మల్టీ పర్పస్ బాలుర ఉన్నత పాఠశాలలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.
జూలై 28న జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేయగా, పలువురు ఉపాధ్యాయులు విధుల్లో లేకపోవడం, వార్షిక ప్రణాళిక డైరీలు నిర్వహించకపోవడం, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)లో సుమారు 50 శాతం మంది విద్యార్థుల హాజరు నమోదు కాకపోవడం వంటి పలు లోపాలు గుర్తించారు. పాఠశాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించడంతో ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
విచారణ నివేదిక ఆధారంగా జీ. బాలముకుంద శర్మ (ఎస్‌ఏ తెలుగు), అక్బర్ ఉన్నీసా (ఎస్‌ఏ జీవశాస్త్రం), నికత్ సుల్తానా (ఎస్‌ఏ హిందీ), రాజేందర్ (ఎస్‌ఏ హిందీ), నాగరాణి (ఎస్‌ఏ తెలుగు), సుభద్ర రాణి (ఎస్‌ఏ సాంఘిక శాస్త్రం)లను సస్పెండ్ చేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే ఎఫ్‌ఆర్‌ఎస్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సీఆర్పీలు క్రాంతికుమార్, సవితల పనితీరుపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి హెచ్చరించారు.

Post a Comment