-->

మినరల్ వాటర్ ప్లాంట్ల దందా.. నిబంధనలకు తూట్లు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం!

 

మినరల్ వాటర్ ప్లాంట్ల దందా.. నిబంధనలకు తూట్లు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం!

ఆసిఫాబాద్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ల దందా.. నిబంధనలకు తూట్లు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరియు తెలంగాణ ఆష్ట్రములో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో సాధారణ నీటినే విక్రయిస్తూ కొందరు నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపరిశుభ్రమైన క్యాన్లలో నీటిని నింపి సరఫరా చేయడంతో పాటు ప్లాంట్లలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేల సంఖ్యలో నీటి క్యాన్లు విక్రయిస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నా, ప్రభుత్వ నిబంధనలను చాలామంది నిర్వాహకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మినరల్ వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. కొన్నింటికి అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ, మరికొన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నీటిలో రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు తూట్లు

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనల ప్రకారం మినరల్ వాటర్ ప్లాంట్లు ఐఎస్‌ఐ ధ్రువీకరణ, కాలుష్య నియంత్రణ అనుమతులతో పాటు పలు ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అర్హత కలిగిన ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించి ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షించాలి. అలాగే ప్రతి క్యాన్‌పై నీటిని నింపిన తేదీ, ఇతర వివరాలతో స్టిక్కర్ ఉండాలి. అయితే జిల్లాలోని పలుచోట్ల ఈ నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ అపరిశుభ్రమైన నీటినే సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల తనిఖీలు కరువు

అనుమతులు లేకుండా కొనసాగుతున్న మినరల్ వాటర్ ప్లాంట్లపై సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, అలాంటి చర్యలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆహార భద్రత అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ వైద్యులు, ఆహార భద్రత అధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్‌లు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మినరల్ వాటర్ ప్లాంట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793