పోలీసుల దాడులు.. ఓయో లాడ్జిల్లో వ్యభిచారం గుట్టురట్టు
కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసుల దాడులు.. ఓయో లాడ్జిల్లో వ్యభిచారం గుట్టురట్టు
హైదరాబాద్, ఆగస్టు 20: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో ఓయో లాడ్జిల ముసుగులో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని రెండు లాడ్జిలపై మంగళవారం రాత్రి కూకట్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
బాలానగర్ ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని మూడో అంతస్తులో ఉన్న వైశాయి కాటేజ్, నాలుగో అంతస్తులోని సాయి పేరడైజ్ లాడ్జిల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలు దాడులు చేపట్టాయి.
ఈ దాడుల్లో ఐదుగురు నిర్వాహకులు, నలుగురు విటులు, ఇద్దరు మహిళలు కలిపి మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిర్వాహకుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
లాడ్జిల నిర్వాహకులు వ్యభిచార కార్యకలాపాల కోసమే వాటిని లీజుకు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. లాడ్జిల నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.
కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ పరిసరాల్లో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ స్వామిగౌడ్, ఎస్సైలు చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, స్రవంతితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment