బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2) కారులో సిద్దిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి శివారుకు చేరుకున్న సమయంలో కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న నలుగురూ మృతి చెందినట్లు గుర్తించారు.
మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment