రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి
రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి టి.పి.సి.సి సభ్యులు జె.బి. శౌరి
కొత్తగూడెం: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టి.పి.సి.సి సభ్యులు జె.బి. శౌరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జె.బి. శౌరి మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక, సాంకేతిక భారతదేశంగా తీర్చిదిద్దేందుకు దూరదృష్టితో కృషి చేసిన మహానేత రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు కంప్యూటర్, సమాచార సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు నేటి భారతదేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, యువతకు మెరుగైన అవకాశాల కల్పన వంటి అంశాలకు రాజీవ్ గాంధీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
“దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మిన మహానేత రాజీవ్ గాంధీ. ఆయన కలలు కన్న ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి” అని జె.బి. శౌరి అన్నారు.
రాజీవ్ గాంధీ చూపిన అభివృద్ధి, ప్రజాసేవ మార్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ కన్వీనర్ ఎం.డి. గౌస్ మోహినుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు సురేష్ అజ్మీర, మాజిక్ ఆప్షన్ మెంబర్ ఆరిఫ్ ఖాన్, యువజన కాంగ్రెస్ టౌన్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాండ్ల సురేష్, నిరంజన్, సమ్మయ్య, కోటిరెడ్డి, దేవేందర్‌రావు, ఎం.డి. అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment