-->

పెద్దపల్లి జిల్లాలో నేడు ఐదుగురు మంత్రుల పర్యటన

 

పెద్దపల్లి జిల్లాలో నేడు ఐదుగురు మంత్రుల పర్యటన

పెద్దపల్లి జిల్లాలో నేడు ఐదుగురు మంత్రుల పర్యటన

పెద్దపల్లి జిల్లా, ఆగస్టు 19: పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఐదుగురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు సుల్తానాబాద్‌, మంథని ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మంత్రులు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఈ పర్యటనలో భాగంగా మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో మొత్తం రూ.387.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మంథని నియోజకవర్గంలో రూ.164.64 కోట్లతో చేపట్టనున్న పనులకు, పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.222.68 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొననున్నారు.

మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభల ప్రాంగణాలు, వేదికలు, పార్కింగ్‌ ప్రాంతాలు తదితర ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మంత్రుల పర్యటనకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమవుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793